Loading...
Varanasi Airport Gunfire: విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ పేలి ఇద్దరికి గాయాలు
విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ పేలి ఇద్దరికి గాయాలు

Varanasi Airport Gunfire: విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ పేలి ఇద్దరికి గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం భద్రతా తనిఖీల సమయంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ముంబయి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి లైసెన్స్‌డ్‌ తుపాకీ నుంచి అనుకోకుండా రౌండ్‌ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ ఆయుధాన్ని నిబంధనల ప్రకారం భద్రతా తనిఖీలకు సమర్పించాడు. అధికారులు ఆయుధాన్ని పరిశీలిస్తున్న సమయంలోనే తుపాకీ నుంచి అనుకోకుండా ఓ రౌండ్‌ పేలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సదరు ప్రయాణికుడు తన భార్యతో కలిసి ముంబయి వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం 'IX-1810' ఎక్కేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు

ఇద్దరు AAICLAS సిబ్బందికి గాయాలు

కాల్పుల ఘటనలో ఇద్దరు AAICLAS భద్రతా స్క్రీనర్లు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఒక ఉద్యోగికి బుల్లెట్‌ తగలగా.. మరో ఉద్యోగికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఘటన అనంతరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సంబంధిత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.

తుపాకీని విమానాశ్రయానికి ఎలా తీసుకువచ్చారు? ఆయుధ తనిఖీ సమయంలో భద్రతా ప్రోటోకాల్స్‌ సరిగ్గా అమలయ్యాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు

భద్రతా నిబంధనలపై మరోసారి చర్చ

విమాన ప్రయాణాల్లో లైసెన్స్‌డ్‌ ఆయుధాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

ప్రయాణికులు ఆయుధాలను తమ వద్ద ఉంచుకోకుండా.. నిర్దేశిత విధానంలో తనిఖీ చేయించి, సురక్షితంగా విమానంలో తరలించాల్సి ఉంటుంది.

వారణాసి విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనతో ఆయుధాల తనిఖీ, వాటి నిర్వహణ, భద్రతా సిబ్బంది పాటించాల్సిన ప్రోటోకాల్స్‌పై మరోసారి చర్చ మొదలైంది.

అసలు కాల్పులు ఏ పరిస్థితుల్లో జరిగాయి? తనిఖీ సమయంలో నిర్దేశిత భద్రతా విధానాలు పూర్తిగా పాటించారా? అనే అంశాలపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT