'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
భారతీయ జనతా పార్టీ తనకు గురువులాంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను ఎలా ఉండకూడదో , ఏ పనులు చేయకూడదో.. బీజేపీ నాయకులే తనకు శిక్షణ ఇచ్చినట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్. భారత్ జూడో యాత్రలో రాహుల్‌గాంధీ భద్రతా ప్రొటోకాల్స్ పాటించలేదని సీఆర్పీఎఫ్ వివరణ ఇచ్చిన అనంతరం.. ఆయన ఈవ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాదయాత్ర అంటే.. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో కూర్చొని చేయరని, ప్రజల మధ్య ఉండే చేస్తారని నొక్కిచెప్పారు. బీజేపీ నాయకులు భద్రతా ప్రోటోకాల్‌ను విస్మరించినప్పుడు నిబంధనలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీనే తనకు ఆదర్శం అన్నారు రాహుల్. దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడారు.
'బీజేపీ పట్ల వ్యతిరేకత'
క్షేత్రస్థాయిలో బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఈ సమయంలో ప్రతిపక్షాలు ఏకమై.. ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షలు కలిసికట్టుగా పని చేస్తే.. బీజేపీకి కష్టాలు తప్పన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనే విషయంపై తనకు ఆహ్వానం అందలేదని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. భారత్ జోడో యాత్ర తలుపులు ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటాయన్నారు. అఖిలేశ్, మాయావతితో పాటు ఇతర నేతలు ప్రేమ పూర్వక హిందుస్థాన్‌ను కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ పార్టీల మధ్య భావజాల సారుప్యత కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు రాహుల్. ఈ యాత్రలో చాలా నేర్చుకున్నట్లు చెప్పారు.