Himani Narwal: కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య.. నిందితుడిని అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలో కాంగ్రెస్ నాయకురాలు హిమాని నర్వాల్ దారుణంగా హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా, ఈ ఘటనలో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
హిమాని హత్య కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వ్యక్తి ఢిల్లీలో నివసించే వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అతను హిమానికి స్నేహితుడని సమాచారం.
హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమాని హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సోమవారం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, నిందితుడి పేరు మాత్రం వెల్లడించలేదు.విచారణలో భాగంగా పోలీసులు అతని వద్ద నుంచి హిమాని మొబైల్ ఫోన్,ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
నిందితుడు హిమానికి అత్యంత సమీప వ్యక్తి..
నిందితుడు హిమానికి అత్యంత సమీప సంబంధమున్న వ్యక్తిగా గుర్తించబడ్డాడు. హిమాని ఇంటికి సమీపంలోనే అతను నివసిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
అంతేకాకుండా, హిమాని నిందితుడిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయని సమాచారం.
ఈ ఆరోపణలపై మరింత సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
వివరాలు
హత్య ఉదంతం
గత శనివారం హర్యానాలోని రోహతక్ జిల్లాలో హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు.
హత్య అనంతరం ఆమె శవాన్ని సూట్‌కేసులో పెట్టి ఓ నిర్మానుష ప్రదేశంలో విసిరివేశారు.
సంప్లా బస్టాండ్ సమీపంలో పడివున్న సూట్‌కేసు స్థానికుల దృష్టికి రాగా, వారు తెరిచి చూడడంతో ఈ విషాదకరమైన హత్య వెలుగులోకి వచ్చింది.
హిమాని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'లో చురుకుగా పాల్గొన్న నాయకురాలిగా గుర్తింపు పొందారు.
ఆమె మెడపై గాయాలుండటం ఈ హత్య మరింత క్రూరంగా జరిగిందనడానికి నిదర్శనంగా మారింది.
వివరాలు
పోలీసుల దర్యాప్తు - ప్రత్యేక బృందం ఏర్పాటు
హిమాని హత్యకేసు విచారణను వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేకదర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
హిమాని కుటుంబం ఢిల్లీలో ఉంటుండగా,ఆమె ఒంటరిగా హర్యానాలో నివసించేదని సంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ తెలిపారు.
బాధితురాలి తల్లి సంచలన ఆరోపణలు
హిమాని తల్లి సవిత ఈహత్యకు రాజకీయకోణం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
ఆమె కూతురు రాజకీయాల్లో ఎదగడాన్ని కొందరు సహించలేక హత్య చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం హిమాని గత దశాబ్దంగా అనేక త్యాగాలు చేశారని ఆమె గుర్తుచేశారు.
పార్టీలో జరిగిన కొన్ని అంతర్గత వివాదాల గురించి హిమాని తనతో పంచుకున్న విషయాలను తల్లి వెల్లడించారు.
అంతేగాక, తన కుమార్తె హత్యకు న్యాయం జరిగే వరకు ఆమె అంత్యక్రియలు నిర్వహించబోనని స్పష్టం చేశారు.