Supreme Court: సామ్యవాదం, లౌకికతపై వివాదం.. కీలక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశికలోని సామ్యవాదం, లౌకికత అనే పదాలను తొలగించాలనే పిటిషన్లను తాజాగా కొట్టివేసింది. ఈ తీర్పును సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలు ప్రవేశికలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు ఈ సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. 42వ సవరణకు పార్లమెంటులో చర్చ లేకుండానే అమలు చేశారు. ఎమర్జెన్సీ (1975-77) సమయంలో ఈ సవరణ చట్టబద్ధతపై ప్రశ్నించారు. సామ్యవాదం అంటే అందరికీ సమాన అవకాశాలని, ఇది సమానత్వాన్ని ప్రతిబింబిస్తుందని, దీనిని వేరే అర్థాల్లో చూడకూడదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం
లౌకికత అనేది నిర్దిష్టమైన భావన అని, దీన్ని కూడా ప్రత్యేకతను దృష్టిలో ఉంచి అర్థం చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. నవంబర్ 22న వాదనలు పూర్తయ్యాక తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు, తాజా తీర్పుతో పిటిషన్లను కొట్టివేసింది. 42వ సవరణను రాజ్యాంగ చట్రానికి అనుగుణంగా జోడించినదేనని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా భారత రాజ్యాంగం పీఠికలోని సామ్యవాదం, లౌకికత అనే మూల సిద్ధాంతాలకు న్యాయబద్ధతను సుప్రీం మరోమారు బలపరచింది.