Cyclone 'Hamoon': బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన 'హమూన్' తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన 'హమూన్' తుపాను బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. దీంతో ఈ తుపాను ప్రభావం బంగ్లాదేశ్ తీరంపై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాబోయే ఆరు గంటల్లో తీవ్ర తుపాను క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. హమూన్ తుపాను బుధవారం ఉదయం 5:30 గంటలకు చిట్టగాంగ్ (బంగ్లాదేశ్)కి తూర్పు-ఆగ్నేయంగా 40 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను బలహీన పడే సమయంలో 80- 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో 'హమూన్' తుపాను నేపథ్యంలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
తేజ్ తుపాను ధాటికి పలు రాష్ట్రాల్లో వర్షాలు
మరో తుపాను 'తేజ్' మంగళవారమే తీరం దాటినట్లు ఐఎండీ పేర్కొంది. రానున్న ఆరు గంటల్లో అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. తుపాను బలహీనపడే క్రమంలో అక్టోబరు 25న మిజోరంలో భారీ వర్షపాతంతో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 26వ తేదీన మిజోరం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.