Cyclone Murusu: తుపాను మురసు బీభత్సం.. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలపై తీవ్ర తుపాను మురసు తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం మధ్యాహ్నానికి మరింత ఉద్ధృతమైంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పల్నాడు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక మహిళ గల్లంతయ్యారు. బాపట్ల జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.
వివరాలు
ఒంగోలులో విద్యుత్తు అంతరాయం
తుపాను ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
ఒంగోలు నగరంలో భారీ సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి.
కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ వృక్షాలు కూలి ప్రకాశం పంతులు విగ్రహం ధ్వంసమైంది.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు నాగులుప్పలపాడు మండలంలో అత్యధికంగా 22.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బలమైన గాలులకు పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి.
కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాలతో పాటు ఒంగోలు నగరంలో పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు పడిపోవడంతో రోజంతా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తపట్నం సమీపంలోని బకింగ్‌హాం కాలువలో ప్రమాదవశాత్తూ జారిపడిన ఓ మహిళ గల్లంతయ్యారు.
వివరాలు
గుంటూరులో భారీగా వరదనీరు
గుంటూరు నగరంలో ప్రధాన రహదారులపై భారీగా వర్షపునీరు చేరడంతో కార్లు కూడా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది.
లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో అక్కడి ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు.
పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు సగటున 6.67 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరో 9.73సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది.
ఫిరంగిపురంలో 17.28,గుంటూరు పశ్చిమలో 13.74,కాకుమానులో 13.32,పెదకాకానిలో 13.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కొండపై నుంచి బండరాయి జారిపడటంతో ఫిరంగిపురం మండలం రాజాపేటకు చెందిన కసిరెడ్డి కృష్ణార్జునరెడ్డి (65) మృతి చెందారు.
వివరాలు
ఐదున్నర గంటల్లో 26.82 సెంటీమీటర్ల వర్షం
ఈ ఘటనలో రెండు గేదెలు కూడా ప్రాణాలు కోల్పోయాయి.
పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలంలో ఐదున్నర గంటల వ్యవధిలోనే 26.82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లావ్యాప్తంగా సగటున 4.73 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
చిలకలూరిపేటలో 22.86, నాదెండ్లలో 23.38, నరసరావుపేటలో 10.86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
యడ్లపాడు మండలం కారుచోల-జాలాది మార్గంలో వరద ఉద్ధృతికి లోలెవల్ చప్టా మీదుగా వెళుతున్న కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది.
జాలాది గ్రామస్థులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై వరదనీటిలో ఇద్దరు గల్లంతయ్యారు. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలను పోలీసులు కాపాడారు.
వివరాలు
బాపట్ల జిల్లాలో ముగ్గురు మృతి
బాపట్ల జిల్లాలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సగటున 5.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మార్టూరులో 22.22, యుద్ధనపూడిలో 16.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
కారంచేడు మండలం దగ్గుబాడులో ఈదురుగాలులకు నీటి ట్యాంకు శిథిలాలు పడటంతో తిరుపతమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందారు.
ఇంకొల్లు మండలం గొల్లపాలెంలో ఇంటి గోడ కూలి వల్లభనేని రాఘవరావు (60) ప్రాణాలు కోల్పోయారు.
చినగంజాం టోల్‌ప్లాజా వద్ద ఇనుప కంటైనర్ కూలడంతో విధుల్లో ఉన్న పెదగంజాం గ్రామానికి చెందిన ఉద్యోగి చొప్పవరపు అగస్టీన్ (25) మృతి చెందారు.
వివరాలు
కృష్ణా, కాకినాడ, ఏలూరులోనూ భారీ వర్షాలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం సగటున 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
విజయవాడ నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఇబ్రహీంపట్నంలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.
ప్రకాశం బ్యారేజీ పది గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
భారీ వర్షానికి కాకినాడ నగరం నీటమునిగింది. ఏలూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు సగటున 8.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వివరాలు
రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు
తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని పలు రైల్వే స్టేషన్లలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు రైళ్లు నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఆహారం, తాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో దాతలు, రైల్వే అధికారులు స్పందించి భోజనం, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
విజయవాడ, గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లను బుధవారం రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించడంతో పాటు సమయాల్లో మార్పులు చేశారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను మంగళవారం రద్దు చేశారు.
వివరాలు
ఒంగోలుకు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను
ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 2,750 విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. మొత్తం 1,367 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడగా, 597 గ్రామాల్లో సరఫరాను పునరుద్ధరించారు.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది.
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
సోమవారం రాత్రి తుపాను నెమ్మదిగా కదులుతూ అర్ధరాత్రి 12 గంటలకు తీరం తాకడం ప్రారంభించింది.
మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలుకు అత్యంత సమీపంలో తీరం దాటింది.
పల్నాడు జిల్లాలోని 11 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.