Loading...
Weather Update: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్‌ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!
ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్‌ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

Weather Update: ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్‌ ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 21 నాటికి వాయుగుండంగా, సెప్టెంబర్ 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 23 ఉదయం నాటికి ఈ వ్యవస్థ ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనికి తోడు దక్షిణ కోస్తాంధ్ర నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా విస్తరించిన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావం కూడా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు.

వివరాలు

కోస్తాంధ్ర, యానాంలో విస్తారంగా వర్షాలు

ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

మంగళవారం వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లోని అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మంగళవారం తీరం వెంబడి గంటకు 50నుంచి 60కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వివరాలు

రాయలసీమలోనూ వర్షాల ప్రభావం

మరోవైపు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం కనిపించనుంది. ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సోమవారం, మంగళవారం కూడా బలమైన ఉపరితల గాలులతో పాటు ఒకటి రెండు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాయలసీమలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

ADVERTISEMENT

వివరాలు

మత్స్యకారులకు హెచ్చరిక

తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదే విధంగా రైతులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది.

ముఖ్యంగా పంట ఉత్పత్తుల విషయంలో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది.

ADVERTISEMENT