
Defence: రక్షణశాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు.. రూ.54 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు డీఏసీ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాదిని సాయుధ దళాల ఆధునికీకరణ లక్ష్యంగా 'సంస్కరణల సంవత్సరం'గా ప్రకటించిన రక్షణశాఖ, త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలను తీసుకుంది.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) గురువారం రూ.54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం తెలిపింది.
ఇందులో టి-90 ట్యాంకుల ఆధునికీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.
వివరాలు
307 శతఘ్నులు కొనుగోలు
ఇక ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్)కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(అటాగ్స్)శతఘ్నులను సైన్యంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
దీనికి రూ.7,000కోట్ల విలువైన భారీ ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం, మొత్తం 307 శతఘ్నులను భారత సైన్యం కోసం కేంద్రం కొనుగోలు చేయనుంది.
అదనంగా,327గన్ టోయింగ్ వాహనాలకూ ఆర్డర్ ఇవ్వనుంది. అటాగ్స్ 150 ఎం.ఎం.శతఘ్ని వ్యవస్థగా, 52 క్యాలిబర్ బ్యారెల్ కలిగి ఉంటుంది.
ఇది 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది.
ఈ వ్యవస్థలో 65%భాగాలు దేశీయంగా తయారు చేసినవి. పాకిస్థాన్,చైనా సరిహద్దుల్లో భారత సైన్యం వీటిని మోహరించే అవకాశం ఉంది.
వివరాలు
డీఏసీ ఆమోదించిన ప్రధాన ప్రాజెక్టులు:
రూ.54 వేల కోట్ల సైనిక ఆధునికీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా,భారతీయ వాయుసేన కోసం గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను కొనుగోలు చేయాలని డీఏసీ నిర్ణయించింది. వీటి ద్వారా వాయుసేన సామర్థ్యం పెరగడమే కాకుండా,వివిధ ఆయుధ వ్యవస్థల పనితీరు మెరుగుపడనుంది.
టి-90 యుద్ధ ట్యాంకుల ఆధునికీకరణ: ప్రస్తుత 1000 హెచ్‌పీ ఇంజిన్ల స్థానంలో 1350 హెచ్‌పీ ఇంజిన్లను అమర్చనున్నారు.దీని వల్ల యుద్ధక్షేత్రంలో ట్యాంకుల కదలికలు మెరుగుపడతాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో వీటి సామర్థ్యం పెరుగుతుంది.
నౌకాదళ ప్రాజెక్టులు: భారత నౌకాదళం ప్రతిపాదించిన వరుణాస్త్ర టోర్పిడోలకు డీఏసీ ఆమోదం తెలిపింది. శత్రు జలాంతర్గాములను పేల్చివేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ టోర్పిడోలను విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబోరేటరీ అభివృద్ధి చేసింది.