LOADING...
Dagadarthi Airport: దగదర్తి ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.648 కోట్లతో నిర్మాణానికి బిడ్డింగ్ ప్రారంభం
రూ.648 కోట్లతో నిర్మాణానికి బిడ్డింగ్ ప్రారంభం

Dagadarthi Airport: దగదర్తి ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.648 కోట్లతో నిర్మాణానికి బిడ్డింగ్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రూ.648.59 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును డిజైన్,బిల్డ్,ఫైనాన్స్,ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌వోటీ) విధానంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ప్రైవేటు సంస్థను ఎంపిక చేసేందుకు తాజాగా బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఎంపికైన సంస్థతో ప్రభుత్వం 45ఏళ్ల రాయితీ ఒప్పందం కుదుర్చుకోనుంది. విమానాశ్రయ నిర్మాణానికి 650ఎకరాల భూమిని,కమర్షియల్, సిటీ సైడ్ అభివృద్ధి కోసం మరో 726 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత నెల 29న ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రతిపాదనలు జారీ చేశారు.

వివరాలు 

2029 నాటికి తొలి దశ పూర్తి

ఈ నెల 12 వరకు గుత్తేదారు సంస్థలు బిడ్‌లు సమర్పించవచ్చు.టెక్నికల్ బిడ్‌లను జూన్ 12న, ఫైనాన్షియల్ బిడ్‌లను జూన్ 17న తెరవనున్నారు. తుది ఎంపికైన సంస్థకు 15రోజుల వ్యవధిలో లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేయనున్నారు. దగదర్తి విమానాశ్రయ ప్రాజెక్టు తొలి దశ (ఫేజ్-1ఏ)ను 2028-29 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా విస్తరణ చేపట్టి,2070 నాటికి నాలుగు దశల్లో మొత్తం ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి దశలో రన్‌వే,టెర్మినల్ భవనం,కార్ పార్కింగ్,రిటైల్, షాపింగ్ ప్రాంతాలు,ఒప్పందంలో పేర్కొన్న ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు వాటికి అవసరమైన నిధుల సమీకరణ, అభివృద్ధి,నిర్వహణ బాధ్యతలను గుత్తేదారు సంస్థ చేపడుతుంది.

వివరాలు 

రోజుకు 2,282 మంది ప్రయాణికులకు సేవలు

మొదటి దశ పూర్తయి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే రోజుకు గరిష్ఠంగా 2,282 మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రోజుకు 27 విమాన సర్వీసుల రాకపోకలు ఉండే అవకాశం ఉంది. రద్దీ సమయాల్లో గంటకు 799 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ విమానాశ్రయం ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యంతో పాటు సరకు రవాణాకు కూడా ఉపయోగపడనుంది. ఎయిర్‌పోర్టును లింక్ రోడ్డు ద్వారా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానం చేయనున్నారు.

Advertisement

వివరాలు 

అన్ని కీలక అనుమతులు పూర్తి

దగదర్తి విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖల నుంచి సైట్ క్లియరెన్స్ లభించింది. అలాగే కేంద్ర హోంశాఖ, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నుంచి కూడా అవసరమైన అనుమతులు రావడంతో ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమైంది.

Advertisement