Dalai Lama: దలైలామా వారసుడి ఎంపిక వేళ.. లుటియన్స్‌లో బంగ్లా కేటాయించిన కేంద్రం!
ఈ వార్తాకథనం ఏంటి
దలైలామా వారసుడి ఎంపికపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా కార్యాలయానికి దేశ రాజధాని దిల్లీలోని అత్యంత కీలకమైన లుటియన్స్ ప్రాంతంలో ఓ బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. పండిట్ రవిశంకర్ శుక్లా లేన్‌లో ఉన్న ఈ నివాసాన్ని 'గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్'కు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాంగ శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ కేటాయింపుపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
వివరాలు
మూడేళ్ల కాలానికి ప్రభుత్వ నివాసాల కేటాయింపు
సాధారణంగా ప్రభుత్వ నివాసాలను మూడేళ్ల కాలానికి కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.
దలైలామా కార్యాలయానికి సంబంధించిన 'గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్' ఆయన సంస్థాగత వ్యవహారాలను పరిరక్షించడంతో పాటు ఆధ్యాత్మిక సేవలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
మానవతా విలువల ప్రచారం, మత సామరస్యం, టిబెట్ సంస్కృతి పరిరక్షణ, పర్యావరణ రక్షణ వంటి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
అంతేకాకుండా ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదను ప్రోత్సహించేందుకు కూడా కృషి చేస్తోంది.
వివరాలు
మూడేళ్ల కాలానికి ప్రభుత్వ నివాసాల కేటాయింపు
మరోవైపు దలైలామా తదుపరి వారసుడి ఎంపిక అంశం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ప్రక్రియలో భారత్‌తోనే సంప్రదింపులు జరపాలని అమెరికాకు చెందిన ఓ కమిషన్ సూచించినట్లు సమాచారం.
తదుపరి దలైలామాను ఎంపిక చేసే అధికారం 'గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్'కే ఉండాలని, ఈ వ్యవహారంలో చైనా జోక్యాన్ని అడ్డుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చ
దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియలో చైనా జోక్యం చేసుకుని, తనకు అనుకూలమైన వ్యక్తిని తదుపరి ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించే అవకాశం ఉందని ఆ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
అందువల్ల వారసుడి ఎంపిక విషయంలో దలైలామా సంస్థకు స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో దలైలామా కార్యాలయానికి బంగ్లా కేటాయించినట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలపై రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.