Velugonda: వెలిగొండకు ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణా జలాల విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ టన్నెళ్ల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారంలో భాగంగా 2,027కుటుంబాలకు రూ.250 కోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే వెలిగొండను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును పూర్తయినట్లు చూపించి జాతికి అంకితం చేశారని జగన్‌పై మంత్రి నిమ్మల విమర్శలు చేశారు.
వివరాలు
జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు
అది ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.900 కోట్ల పరిహారంలో జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు.
నిర్వాసితులను మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని నిమ్మల తెలిపారు.
మొత్తం ఏడు నిర్వాసిత కాలనీల్లో నాలుగు కాలనీల్లో 100శాతం మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని చెప్పారు.
మిగిలిన మూడు కాలనీల్లో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని వెల్లడించారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు వరం వంటిదని మంత్రి పేర్కొన్నారు.
ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు.