26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా
26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. ఉగ్రదాడులకు రెండు రోజులు ముందు పాక్- కెనడా వ్యాపారవేత్త తహవుర్ హుస్సేన్ రాణా ముంబై సబర్బన్ పొవాయ్‌లోని ఒక హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)కి సంబంధించిన కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ముందు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ సోమవారం 400 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించింది. ఈ సందర్భంగా తహవుర్ రాణా కేసు వివరాలను అందులో పేర్కొంది. తహవుర్ రాణా ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో నిర్బంధంలో ఉన్నాడు. ముంబై దాడుల్లో అతని పాత్ర ఉందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
హెడ్లీతో కలిసి ముంబై దాడులకు రాణా ప్లాన్
26/11 దాడులకు ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన పాకిస్థాన్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో రాణాకు దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నాడు. రాణా నవంబర్ 11, 2008న భారత్‌కు వచ్చి నవంబర్ 21 వరకు దేశంలోనే ఉన్నారని తాజా ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. రాణాకు వ్యతిరేకంగా డాక్యుమెంటరీ సాక్ష్యాలు, 26/11 కుట్రలో అతని పాత్రను నిర్ధారించిన కొన్ని ఆధారాలు తమకు లభించినట్లు పోలీసులు తెలిపారు. డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి రాణా ఈ కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. నకిలీ పత్రాల సహాయంతో హెడ్లీకి భారతీయ పర్యాటక వీసా పొందడానికి రాణా సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. 26/11 ఉగ్రదాడులను నిర్వహించడంలో లష్కరే తోయిబాకు లాజిస్టిక్ సపోర్టును రాణా అందించాడని ఆరోపించారు.