Nirmala Sitharaman:నిర్మలా సీతారామన్ పేరుతో డీప్‌ఫేక్ వీడియో.. నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న వ్యాపారి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు సైబర్ నేరగాళ్లకు అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నట్లుగా సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోను నమ్మిన పూణెకు చెందిన 56 ఏళ్ల వ్యాపారి రూ.1.07 కోట్లను కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడి పెట్టిన ఆయన, చివరికి మోసపోయానని గుర్తించి పూణె సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ మొదటి వారంలో బాధితుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన కనిపించింది.
అందులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లుగా డీప్‌ఫేక్ వీడియోను రూపొందించారు.
వీడియోను నిజమని నమ్మిన వ్యాపారి, దానిలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్లు ఆయనను సంప్రదించారు.
ఈ పెట్టుబడుల వల్ల వ్యక్తిగతంగా లాభాలు రావడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నమ్మబలికారు.
అనంతరం ఆధార్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించారు.
వివరాలు
నమ్మకం కోసం మొదట చిన్న మొత్తంలో లాభాల జమ
తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి తనను 'రిలేషన్‌షిప్ మేనేజర్'గా పరిచయం చేసుకుని, నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో బాధితుడితో ఖాతా తెరిపించాడు.
మొదటగా రూ.20,341 పెట్టుబడి పెట్టించగా, కొద్ది రోజులకే రూ.1,000 లాభం వచ్చినట్లు చూపించి ఆ మొత్తాన్ని బాధితుడి అసలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
అంతేకాదు, మధ్యలో రూ.7 లక్షలను విత్‌డ్రా చేసుకునేందుకు కూడా అనుమతించారు.
దీంతో ఆ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌పై బాధితుడికి పూర్తి స్థాయిలో నమ్మకం ఏర్పడింది.
బాధితుడి విశ్వాసాన్ని పూర్తిగా సంపాదించిన తర్వాత, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రీ-లిస్టింగ్ షేర్లు మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తున్నాయని, ఇప్పుడే పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఖాయమని స్కామర్లు ఆశ చూపించారు.
వివరాలు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పూణె సైబర్ పోలీసులు
వారి మాటలు నమ్మిన వ్యాపారి జూన్ 2 నుంచి జులై 23 వరకు మొత్తం 36 విడతల్లో రూ.1.07 కోట్లను వారు సూచించిన వివిధ మ్యూల్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ డ్యాష్‌బోర్డులో తన పెట్టుబడి విలువ రూ.3.98 కోట్లకు పెరిగినట్లు కనిపించడంతో బాధితుడు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు.
అయితే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీల పేరుతో నేరగాళ్లు మరింత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు బాధితుడు గ్రహించారు.
వెంటనే పూణె సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.