
Telangana: ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం.. తెలంగాణ రైతుల్లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) ఇవ్వడాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఫార్మర్ రిజిస్ట్రీ' ప్రాజెక్టు అమలులో సాంకేతిక సమస్యలు అడుగడుగునా తలెత్తుతున్నాయి.
రాష్ట్రంలో వారం రోజులుగా ఈ ప్రక్రియ సాగుతున్నా ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ కాలేదన్నది భద్రమైన సమాచారం.
ఈ పరిస్థితితో రైతుల్లో అసంతృప్తి, ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతుండగా, తెలంగాణలో మాత్రం ఈ నెల 5 నుంచి ప్రారంభమైంది.
మండల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు రైతు వేదికలు, వ్యవసాయ కార్యాలయాల్లో నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
Details
రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి ఆగిపోతోంది
ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఆధారంగా రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు.
అయితే రైతులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వెంటనే విశిష్ట సంఖ్య రావాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం రిజిస్ట్రేషన్ నంబరే ఇచ్చి ఆగిపోతున్నారు.
మొదటి రోజే ఈ సమస్యను అధికారులు ఉన్నత స్థాయికి తెలియజేయగా - 24 గంటల్లో ప్రత్యేక గుర్తింపు సంఖ్య వస్తుందని చెప్పారు.
కానీ కొన్ని రోజులైనా అవి జారీ కాకపోవడంతో శనివారం మళ్లీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వారు సోమవారం కేంద్రానికి ఈ విషయం నివేదించి పరిష్కరించాలని పేర్కొన్నారు. సాంకేతిక సమస్య వెనక అసలు కారణం కూడా చర్చకు వచ్చింది.
Details
సర్వర్ లో సమస్యలు
దేశంలోని ఇతర రాష్ట్రాలు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ద్వారా ఈ ప్రక్రియను చేపడుతుంటే, తెలంగాణ మాత్రం వ్యవసాయ శాఖ సొంత యాప్ ద్వారా నమోదును మొదలుపెట్టింది.
అధికారుల ప్రకారం, మీ సేవ ప్లాట్‌ఫాం ద్వారా నమోదుకు అవకాశం కల్పిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అది ప్రారంభం కాలేదు.
దీంతో AEVOలే యాప్ ద్వారా నమోదు చేస్తున్న పరిస్థితిలో సర్వర్ సమస్యలు రోజూ ఎదురవుతున్నట్లు సమాచారం.
ఈ సాంకేతిక తడబాటు వల్ల రైతుల విశిష్ట గుర్తింపు సంఖ్యల జారీ వాయిదా పడుతూ రైతుల్లో గందరగోళాన్ని కలిగిస్తోంది.