Delhi: దిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. యజమాని హరిరామ్‌పై లుకౌట్ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. భవనం యజమాని హరిరామ్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. అతడిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణానికి సమీపంలోని సత్యనికేతన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఐదంతస్తుల భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
వివరాలు
12మందిని సురక్షితం
ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు బయటకు తీసుకొచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 12మందిని సురక్షితంగా రక్షించారు.
ఇంకా సహాయక చర్యలు, దర్యాప్తు కొనసాగుతున్నాయి. మరోవైపు దిల్లీ సీఎం రేఖా గుప్తా సోమవారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
భవనం కూలిపోవడానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు.
బేస్‌మెంట్‌లో నీరు చేరడం,మరమ్మతుల కోసం చేపట్టిన పనుల కారణంగానే నిర్మాణం బలహీనపడి ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.