Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష 19వ రోజుకు.. వైద్య పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని వైద్య చర్యలను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ వైద్యుల బృందం ప్రతిరోజూ ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు,ప్రతి పౌరుడి ప్రాణం అత్యంత విలువైనదని పేర్కొంది.
వివరాలు
అవసరమైతే వెంటనే వైద్యం అందించాలని ఆదేశం
నిరసన చేసే హక్కు ఉన్నప్పటికీ, ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ప్రభుత్వం అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించింది.
పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం 59 ఏళ్ల సోనమ్ వాంగ్‌చుక్ ఇప్పటివరకు సుమారు 8.5 కిలోల బరువు తగ్గారు.
మరో 48 గంటల పాటు నిరాహార దీక్ష కొనసాగితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ద్రవరూపంలో పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలు వంటి వైద్య సహాయాన్ని అందించాలని కూడా కోర్టును కోరారు.
వివరాలు
ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష విరమించబోనన్న వాంగ్‌చుక్
విచారణ సందర్భంగా ఇప్పటి వరకు ప్రభుత్వవైద్యులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీనికి స్పందించిన కేంద్రం తరఫు న్యాయవాది తుషార్ మెహతా,ప్రభుత్వ వైద్యులు ప్రతిరోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారని,కొన్నిసందర్భాల్లో ప్రైవేట్ వైద్యులు కూడా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారని తెలిపారు.
అయితే ఇకపై ప్రభుత్వ వైద్యులే రోజువారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని,అవసరమైన చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా,హైకోర్టు ఆదేశాలు వెలువడేందుకు కొద్ది గంటల ముందు వాంగ్‌చుక్ వీడియో సందేశం విడుదల చేశారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని,శారీరకంగా బలహీనత ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించే వరకు నిరాహారదీక్షను విరమించే ఉద్దేశం లేదని తెలిపారు.
వివరాలు
జులై 20 నిరసనకు పెద్ద సంఖ్యలో రావాలని ప్రజలకు పిలుపు
అలాగే జులై 20న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం ఈ అంశాన్ని పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకెళ్తామని,అప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థులు కూడా ప్రజాస్వామ్యబద్ధమైన ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.