దిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట
దిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది. దిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ పేరూ ఉండటంతో గతంలో పలుమార్లు నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ విచారణకు మాత్రం గైర్హజరయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవలే ఆయన బెయిల్ పొందడం, అనంతరం అప్రూవర్ పిటిషన్ వేయడం, కోర్టు అంగీకరించడం చకాచకా జరిగిపోయాయి. తాజాగా మాగుంట సైతం అప్రూవర్ పిటిషన్ వేయడం దిల్లీ లిక్కర్ స్కాంలో దుమారం రేపనుంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు.
బాలాజీ గ్రూప్ లిక్కర్ తయారీ, పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
మరోవైపు మాగుంట వెల్లడించిన వివరాలతో ఈడీ దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి దిల్లీకి నగదు తరలింపుపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. బాలాజీ గ్రూప్ యజమాని మాగుంట రాఘవ దిల్లీలో లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. గత 70 ఏళ్లుగా మాగుంట కుటుంబం లిక్కర్ వ్యాపారంపైనే ఆధారపడింది. దేశంలో చాలా చోట్ల మాగుంట ఫ్యామిలీకి లిక్కర్ దుకాణాలున్నాయి. ఏంజెల్ షాంపైన్ ఎల్ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కంపెనీలు లిక్కర్ తయారీ, పంపిణీలో అవకతవకలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో భాగంగా ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదు. కానీ ఇందుకు విరుద్ధంగా వ్యాపారం చేసినందునే దిల్లీలో మద్యం కుంభకోణం జరిగినట్లు ఈడీ వాదిస్తోంది.