AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్ డిమాండ్.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..!
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజీనామా ప్రకటన దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాన్ని తీసుకువచ్చింది. మహారాష్ట్రతో పాటు దిల్లీలో ముందస్తు ఎన్నికలు జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిమాండ్ చేస్తున్న వేళ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిల్లీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సంబంధిత వర్గాల సమాచారం. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటించిన తరువాత,తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం చర్చనీయాంశమైంది. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.ఈ నేపథ్యంలో ఆప్ కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) స్పందించారు.
బీజేపీ ముందస్తు ఎన్నికలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి: సౌరభ్ భరద్వాజ్
కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించనున్నారని, ఆమోదం వచ్చిన వెంటనే కొత్త సీఎం ఎంపికపై చర్చిస్తామని, పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ''ప్రజలకు ఆప్‌పై నమ్మకం ఉంది.వారు మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారు.అభ్యర్థి ఎవరనేది తెలియడానికి కొంత సమయం పడుతుంది.వారం రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది.బంతి ఇంకా బీజేపీ కోర్టులోనే ఉంది. ముందస్తు ఎన్నికలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, కేజ్రీవాల్‌కు ఎదురు నిలిచేందుకు సిద్ధమైతే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని'' సౌరభ్ భరద్వాజ్ బీజేపీని సవాలు చేశారు. కేజ్రీవాల్ పరువు తీసేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసినా, ప్రజలకు ఆయన నిజాయతీపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికల అంశంపై ఈ నిర్ణయం ఆప్‌కు షాక్‌గా మారింది.
కేజ్రీవాల్‌తో సిసోడియా భేటీ!
కాగా, సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం, ఎన్నికలు జరిగే వరకు వేరొకరు ఆ బాధ్యతలు చేపడతారని చెప్పడం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. తాత్కాలిక సీఎం ఎవరన్న విషయంపై ఆప్ నేతలు చర్చలు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, సోమవారం కేజ్రీవాల్‌తో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భేటీ కానున్నారు.