Dengue Cases: తెలంగాణలో పెరుగుతున్న డెంగీ కేసులు.. ఇప్పటికే 3 వేలకుపైగా నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోనూ డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే డెంగీ కారణంగా ఇద్దరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వివరాలు
5 లక్షల మందికిపైగా జ్వర బాధితులు..
రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు జ్వర సర్వే చేపట్టారు.
ఇప్పటివరకు 5 లక్షల మందికిపైగా జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
వీరిలో దాదాపు 3 వేల మంది డెంగీ బారినపడినట్లు తేలింది. మరోవైపు సుమారు 5 వేల టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
అయితే టైఫాయిడ్‌తో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా వైద్యాధికారులు చెబుతున్నారు.
స్వల్ప సంఖ్యలో మలేరియా కేసులు కూడా వెలుగుచూశాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వస్తున్న రోగుల్లో సుమారు 20 శాతం మంది జ్వర బాధితులే ఉంటున్నారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ జ్వరంతో వచ్చే రోగుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రి కిటకిటలాడుతోంది.
వివరాలు
5 లక్షల మందికిపైగా జ్వర బాధితులు..
హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో సెప్టెంబరు మూడో వారం వరకు రోజుకు సుమారు 400 మంది జ్వర బాధితులు ఓపీకి వచ్చేవారు. నెలాఖరుకు ఆ సంఖ్య 600 దాటింది.
ఆగస్టు వరకు రాష్ట్రంలో డెంగీ కేసులు వందల సంఖ్యలోనే ఉండగా.. సెప్టెంబరులో వాటి సంఖ్య వేలల్లోకి చేరింది.
దీనికి తోడు డెంగీ కారణంగా ఇద్దరు మృతి చెందడంతో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
డెంగీ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న కొందరిలో తొలిరోజే ప్లేట్‌లెట్ల సంఖ్య సుమారు 1.20 లక్షల వరకు ఉంటోంది.
అయితే నాలుగు రోజుల్లోనే అవి 30 వేల నుంచి 20 వేల వరకు పడిపోతున్న సందర్భాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
వివరాలు
అప్రమత్తంగా ఉండాలి: వైద్యులు
డెంగీ బారినపడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి శుక్రవారం 'డ్రై డే' నిర్వహించి ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
నిల్వ ఉన్న నీటిలోనే డెంగీకి కారణమయ్యే దోమల లార్వా పెరుగుతుంది.
అందువల్ల ఇంటి పరిసరాల్లో నీరు నిలిచే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
వివరాలు
అప్రమత్తంగా ఉండాలి: వైద్యులు
డెంగీ సోకినప్పుడు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు.
మలం నల్లగా రావడం కూడా ప్రమాద సూచనగా భావించాలి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
శరీరంపై దద్దుర్లు రావడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం జరగడం వంటి లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కాచి వడపోసిన నీటిని తాగడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.