LOADING...
Konaseema: ఇరుసుమండ బ్లోఅవుట్‌పై కేంద్ర డీజీఎంఎస్‌ విచారణ ప్రారంభం
ఇరుసుమండ బ్లోఅవుట్‌పై కేంద్ర డీజీఎంఎస్‌ విచారణ ప్రారంభం

Konaseema: ఇరుసుమండ బ్లోఅవుట్‌పై కేంద్ర డీజీఎంఎస్‌ విచారణ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన చోటుచేసుకున్న బ్లోఅవుట్‌ ఘటనపై విచారణలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన బ్లోఅవుట్‌పై కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీజీఎంఎస్‌ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మూడు రోజుల కిందటే డీజీఎంఎస్‌ అధికారులు ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారని ఓఎన్జీసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా,ఈ ఘటనపై ఓఎన్జీసీ కూడా అంతర్గతంగా విచారణ ప్రారంభించిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శాంతన్‌దాస్‌ వెల్లడించారు. అన్ని విచారణలు పూర్తయ్యాక బ్లోఅవుట్‌ ఎలా జరిగింది? దానికి కారణాలేంటి? అనే విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

నాలుగు లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ దగ్ధమైనట్లు అధికారులు అంచనా

బ్లోఅవుట్‌ను నియంత్రించేందుకు ఓఎన్జీసీ బృందం ఐదు రోజుల పాటు నిరంతరంగా శ్రమించింది. చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చి శనివారం బావిని పూర్తిగా మూసివేసింది. ఈ ఐదు రోజుల పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రమాద ప్రభావంతో ఆక్వా చెరువులు,వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి.డ్రిల్లింగ్‌ సైట్‌లో ఉన్న కోట్ల రూపాయల విలువైన యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా,బ్లోఅవుట్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా ఓఎన్జీసీ నరసాపురం యార్డ్‌ నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన మడ్‌ పంపింగ్‌ యూనిట్‌,డోజర్‌,బీవోపీ,బీవోపీ కంట్రోల్‌ యూనిట్‌,వాటర్‌ మానిటర్లు వంటి భారీ పరికరాలను పనులు పూర్తికావడంతో తిరిగి నరసాపురం తరలించారు.

Advertisement