డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు
ప్రకృతి ప్రకోపానికి కుంచించుకుపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పట్టణంలో కూలిపోయే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రోజు రోజుకు పగుళ్లు వచ్చిన ఇళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది విపత్తుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జోషిమఠ్‌లో ఇప్పటి వరకు మొత్తం 678 ఇళ్లు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు చెప్పారు. 81 కుటుంబాలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. నివాసానికి అనుకూలంగా లేని భవనాలకు రెడ్ మార్కులు పెట్టినట్లు చెప్పారు. జోషిమఠ్ వాసులు.. ఎముకలు కొరికే చలిలోనూ తమ ఇళ్లను వదలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.
సహాయక చర్యలు ముమ్మరం
సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ చెప్పారు. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఎన్డీఆర్‌ఎఫ్, పీఏసీ అదనపు కంపెనీ సిబ్బందితో పాటు పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి కొన్ని ప్రాంతాలను సీజ్ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు జోషిమఠ్ సమీపంలో నిర్మాణాలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఇలాంటి నిర్మాణాల వల్లే.. జోషిమఠ్‌కు ఇలాంటి పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ జోషిమఠ్‌లోని విపత్తు పీడిత ప్రాంతాన్ని సందర్శించారు. బాధిత ప్రజలను ధైర్యం చెప్పారు.