GPS: సైనిక జీపీఎస్ జామింగ్ వల్లే న్యూ మెక్సికోలో వైద్య విమానం కూలిందా? నివేదికలో వెల్లడైన వివరాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో కుప్పకూలిన వైద్య విమాన ప్రమాదానికి సమీపంలోని వైట్ సాండ్స్ మిసైల్ రేంజ్‌లో నిర్వహించిన సైనిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విన్యాసాలే కారణమై ఉండొచ్చని తాజా నివేదిక వెల్లడించింది. జూన్‌లో అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రచురించిన వివరాలను విశ్లేషిస్తూ వైర్డ్ (Wired) విడుదల చేసిన కథనం ప్రకారం, ప్రమాద సమయంలో ఆ ప్రాంతమంతా సైన్యం జీపీఎస్ సంకేతాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడంతో చిన్న ద్వి-ఇంజిన్ మెడికల్ ఎవాక్యుయేషన్ (మెడీవాక్) విమానంలోని జీపీఎస్ వ్యవస్థ పనిచేయలేదు.
వివరాలు
ఇద్దరు పైలట్లు మృతి..
జీపీఎస్ సేవలు నిలిచిపోవడంతో విమానం దిగాల్సిన రన్‌వేకు ముందు ఉన్న కొండ ప్రాంతం గురించి పైలట్లకు సరైన అవగాహన లేకపోయింది.
దీంతో విమానం కొండను ఢీకొని కూలిపోయినట్లు నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విమానం కూలిన అనంతరం చెలరేగిన మంటలు భారీ అడవి అగ్నిప్రమాదానికి దారితీయగా, ఆ మంటలు వారాల తరబడి పరిసర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ఈ ఘటన సమయంలో తక్కువ దృశ్యమానత, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌పై అధిక పని భారం, జీపీఎస్ జామింగ్ వంటి అంశాలు కలిసి మరో మూడు విమానాల నావిగేషన్ వ్యవస్థలపైనా ప్రభావం చూపినట్లు సమాచారం.
వివరాలు
పైలట్లకు హెచ్చరికలు జారీ..
జీపీఎస్ అంతరాయాలు ఎదురయ్యే అవకాశం ఉందని సైన్యం ముందుగానే పైలట్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
అయితే అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో విమానంలోని జీపీఎస్ సమస్యలను మాత్రమే ప్రస్తావించగా, ప్రమాదానికి అధికారిక కారణాన్ని ఇప్పటికీ నిర్ధారించలేదు.
ఈ ఘటనపై స్పందించిన రిటైర్డ్ ఎయిర్‌లైన్ పైలట్, సేఫ్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్ సీఈఓ జాన్ కాక్్స్ మాట్లాడుతూ, "జీపీఎస్ పనిచేయకపోవడం ఒక్కటే విమానం కూలిపోవడానికి కారణం కాలేదు.
దీనికి మరికొన్ని అంశాలు కూడా కలిసి ఉండాలి" అని అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు.
వివరాలు
ప్రమాదాన్ని నివారించేలా అదనపు భద్రతా చర్యలు..
మరోవైపు విమాన ప్రమాదాల విశ్లేషకుడు, ఎయిర్‌లైన్ పైలట్ జువాన్ బ్రౌన్ మాట్లాడుతూ, "అలాంటి సమయంలో జీపీఎస్ సూచనలు పూర్తిగా నిలిచిపోతే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది" అని వైర్డ్‌తో పేర్కొన్నారు.
అమెరికా గగనతలంలో సైన్యం నిర్వహించిన జీపీఎస్ జామింగ్ కారణంగా పౌర విమానం కూలిపోయిన తొలి ఘటనగా దీనిని భావిస్తున్నారు.
పైలట్లకు ముందుగానే హెచ్చరికలు ఇచ్చినప్పటికీ, ప్రమాదాన్ని నివారించేలా అదనపు భద్రతా చర్యలు లేదా తగిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏర్పాట్లు లేకపోవడం పరిస్థితిని మరింత విషమం చేసిందని వైర్డ్ నివేదిక వెల్లడించింది.
ఇటీవలి సంవత్సరాల్లో జీపీఎస్ జామింగ్ ఘటనలు గణనీయంగా పెరిగినట్లు ఎయిర్‌క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ పైలట్స్ అసోసియేషన్ గణాంకాలు సూచిస్తున్నాయి.