Garapati Divya: నిన్న గుండెపోటుతో మృతి.. నేడు ఎన్నికల్లో 350 ఓట్ల మెజార్టీతో విజయం!
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య (28) 350 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఆమె గెలుపు వార్త వినేందుకు ఈ లోకంలో లేకపోవడం అందరినీ కలచివేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక్కరోజు ముందే గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచినప్పటికీ.. మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. దీంతో ఆ కుటుంబంలో గెలుపు సంబరాలు జరగాల్సిన సమయంలో తీరని విషాదం అలుముకుంది. డిగ్రీ పూర్తి చేసిన దివ్య.. శ్రీనివాస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.
వివరాలు
మార్గధ్యంలోనే మృతి
ఈ దంపతులకు ఐదేళ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో దివ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ఓటు వేసిన కొద్దిసేపటికే ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడిందని భావించి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కానీ శుక్రవారం ఉదయం దివ్య ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది.
దీంతో ఆమెను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. మార్గమధ్యంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వివరాలు
గెలుపు వార్త తెలిసినా.. అనుభవించలేని దురదృష్టం
శుక్రవారం దివ్య మృత్యువుతో పోరాడి కన్నుమూయగా.. సరిగ్గా మరుసటి రోజు శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమె 350 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ప్రజల నుంచి అపారమైన మద్దతు పొంది, తన వార్డు అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ నాయకురాలు.. తాను గెలిచిన వార్తను చూసేందుకు కూడా లేకపోవడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
ఒకవైపు ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందం ఉండాల్సిన సమయంలో.. మరోవైపు ఆమె మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కన్నతల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేస్తోంది. గెలుపు సంబరాలు జరగాల్సిన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నీటి పర్యంతమవుతున్నారు.
వివరాలు
దివ్య కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
దివ్య మృతదేహానికి శుక్రవారం గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి సువర్ణరాజు, కూటమి నాయకులు నివాళులర్పించారు.
అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు.