Omar Abdullah: పీవోకే పరిస్థితులు చూస్తే బాధేస్తోంది.. ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను రద్దు చేయకపోయి ఉంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ప్రజలు జమ్మూకశ్మీర్‌లో విలీనం కావాలని కోరుతూ తిరుగుబాటు చేసేవారని ఆయన వ్యాఖ్యానించారు. 1947లో పాకిస్థానీ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా కశ్మీర్ ప్రజలు పోరాడారని ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. అప్పట్లో తమ పూర్వీకులు చెప్పిన మాటలు ఎంత నిజమో అర్థమవుతోందన్నారు. దాడికి దిగాలనుకునేవారికి ఒక హెచ్చరిక.. మేం కశ్మీరీలం, పోరాటానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
వివరాలు
ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే బాధగా ఉంది
ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే బాధగా ఉందని ఒమర్ అన్నారు.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేయకపోయి ఉంటే.. పీఓకే ప్రజలు తమను తిరిగి జమ్మూకశ్మీర్‌లో విలీనం చేయాలని కోరుతూ తిరుగుబాటు చేసేవారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
పీఓకే ప్రజల కోసం జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో కొన్ని స్థానాలను ఖాళీగా ఉంచుతున్నామని ఒమర్ తెలిపారు. 'ఏదో ఒకరోజు ఆ సీట్లు నిండుతాయన్న ఆశతో ఉన్నామని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వివరాలు
ఒమర్ వ్యాఖ్యలపై భాజపా ఆగ్రహం
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సునీల్ శర్మ ఒమర్‌పై విమర్శలు చేశారు.
'ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఆయన రాజకీయాలు చేస్తున్నారు.
భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడాల్సిన వేదికను రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారంటూ సునీల్ శర్మ మండిపడ్డారు