
Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ (HPV) పరీక్ష కిట్లు సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. సర్వైకల్ క్యాన్సర్ కేసుల్లో 90 శాతానికి పైగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా ఉత్పన్నమవుతాయి.
అందుబాటు ధరలో టీకాలు, పరీక్షలు, చికిత్స అందించడం ప్రభుత్వ జాతీయ బాధ్యత. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, అలాగే తగిన చికిత్సను ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
అలాగే ప్రైవేటు రంగ సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వంతో కలిసి సామూహిక వైద్య పరీక్షల్లో భాగస్వామ్యం కావాలి.
Details
భారతీయ మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువ
హెచ్‌పీవీ పరీక్ష కిట్లను ఉపయోగించి తక్షణ ఫలితాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చని మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.
గణాంకాల ప్రకారం, భారతీయ మహిళల్లో సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యాధితో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది భారతీయ మహిళలేనని వెల్లడించారు.
వ్యాధి ఆలస్యంగా గుర్తవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.