Loading...
Rahul Gandhi: విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌ల వినియోగం.. దిల్లీలో రాహుల్‌ గాంధీ ధర్నా

Rahul Gandhi: విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌ల వినియోగం.. దిల్లీలో రాహుల్‌ గాంధీ ధర్నా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు పెల్లెట్‌ గన్‌లను ఉపయోగించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. పెల్లెట్లు తగిలి గాయపడిన సాహిల్‌ అనే యువకుడితో కలిసి శుక్రవారం మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. అయితే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు నిరాకరించడంతో.. పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ బయట రాహుల్‌ గాంధీ ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ఈ నెల 17న ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు

ఆయనతో పాటు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.

దీంతో పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు నిరసన చేపట్టిన సమయంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు, భద్రతా బలగాలు పెల్లెట్‌ గన్‌లను వినియోగించాయని రాహుల్‌ గాంధీ వెల్లడించారు.

ఈ కాల్పుల్లో పెల్లెట్లు తగిలి గాయపడిన ఓ విద్యార్థితో కలిసి ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించారు.

వివరాలు 

చర్యలు తీసుకునే వరకు నిరసన: రాహుల్ 

విద్యార్థులు గాయపడిన ఘటనపై పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌లను ఉపయోగించిన సిబ్బందిపై ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే వరకు తన నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

DCP ఆఫీస్ వద్ద రాహుల్ గాంధీ 

ADVERTISEMENT