East Godavari District Court: తూర్పు గోదావరి కోర్టుకు 222 ఏళ్లు.. రాజమండ్రిలో ఘనంగా వేడుకలు!
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఏర్పాటై 222ఏళ్లు పూర్తయిన సందర్భంగా, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రక వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు న్యాయవ్యవస్థకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈకార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి (సరస వెంకటనారాయణ భట్టి), జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి. నరసింహ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావుతో పాటు ఏపీ హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఒకే వేదికపైకి ఇంతమంది న్యాయమూర్తులు, ప్రభుత్వాధినేత రావడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
ప్రత్యేక సావనీర్ ఆవిష్కరణ
తూర్పు గోదావరి జిల్లా కోర్టు సుదీర్ఘ ప్రస్థానం, రాజమండ్రి బార్ అసోసియేషన్ అందించిన సేవలను ప్రతిబింబించేలా ప్రత్యేక సావనీర్‌ను రూపొందించారు.
ఈ సావనీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఆవిష్కరించారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన తూర్పు గోదావరి జిల్లా కోర్టు న్యాయపరిపాలనలో విశేష సేవలందించిందని ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు.
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే న్యాయవాద వృత్తిలో సేవలందిస్తున్న రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.