కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం ప్రకటించింది. మే 10న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నోటిఫికేషన్ తేదీ : ఏప్రిల్ 13 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఏప్రిల్ 20 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 24 పోలింగ్ : మే 10 కౌంటింగ్ తేదీ: మే 13 కర్ణాటకలో 224 నియోజకవర్గాలు, 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో 2.62 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.5 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 224 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం
కర్ణాటకలో కొత్త ఓటర్లు 9.17 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ పేర్కొన్నారు. 2.15 లక్షల మంది ఓటర్లు 80 ఏళ్లు పైబడిన వారే ఉన్నట్లు సీఈసీ తెలిపారు. 16,976 మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారని వివరించారు. కర్ణాటక ఎన్నికల కోసం 58,282 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 1,320 పోలింగ్ స్టేషన్‌లను మహిళా అధికారులు నిర్వహిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. తొలిసారిగా 80 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కర్ణాటకలో అందుబాటులో తెచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.