Telangana: తెలంగాణ ఓటర్ల సర్వే గడువు పొడిగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) సమర్పించే గడువును ఆగస్టు 3 వరకు పొడిగించింది. తొలుత ఈ గడువును జులై 24తో ముగించాలని నిర్ణయించినప్పటికీ, రాష్ట్రంలో సర్వే పురోగతి మందగించిన నేపథ్యంలో అదనపు సమయం కల్పించింది. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణకు గడువు పెంచడంతో మొత్తం షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. అలాగే ముందుగా జులై 31న విడుదల చేయాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఇప్పుడు ఆగస్టు 10న ప్రచురించనున్నారు.
వివరాలు
నెమ్మదిగా సాగుతున్న ఎన్యూమరేషన్ పత్రాల సేకరణ
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని పలు ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)ను కలిసి గడువు పెంచాలని వినతిపత్రాలు సమర్పించాయి.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో ఎన్యూమరేషన్ పత్రాల సేకరణ నెమ్మదిగా సాగుతున్నట్లు వారు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ పరిస్థితులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు నివేదికతో పాటు లేఖ పంపించారు.
రాజకీయ పార్టీల విజ్ఞప్తి, క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ప్రక్రియను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగింపునకు ఆమోదం తెలిపింది.
వివరాలు
బుధవారం నాటికి 100 శాతం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ
షెడ్యూల్ మార్పులతో కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు లేదా చిరునామా వంటి వివరాల్లో మార్పులు చేసుకోవాలనుకునే వారు ఫారం-6, ఫారం-8లను ముందుగా నిర్ణయించినట్లుగా జులై 31 తర్వాత కాకుండా, ఆగస్టు 10 తర్వాత సమర్పించాల్సి ఉంటుంది.
ఈ మార్పులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ బుధవారం నాటికి 100 శాతం పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తన నివేదికలో స్పష్టం చేశారు.