Election Commission of India: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. జనవరిలో షెడ్యూల్ ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తును వేగవంతం చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈసీ పూర్తిస్థాయి బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించనుంది. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్‌లో ఈ పర్యటనలు ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈ బృందంలో ఉంటారు. పర్యటనలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తారు.
వివరాలు
ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో డిప్యూటీ కమిషనర్ల స్థాయి పర్యటనలు పూర్తి
రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికల సన్నద్ధతపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు.
మరోవైపు, ఇప్పటికే డిప్యూటీ ఎన్నికల కమిషనర్ (డీఈసీ) స్థాయి బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించాయి.
పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ పర్యటనలు పూర్తయ్యాయి.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఒక విడత పర్యటన ముగిసింది. మరో రెండు విడతల్లో అధికారులు పర్యటించాల్సి ఉంది.
గోవాలో మాత్రం డీఈసీ బృందం ఇంకా పర్యటించలేదు. ఈ బృందాలన్నీ నవంబర్ నెలాఖరులోగా తమ నివేదికలను ఎన్నికల సంఘానికి అందించనున్నాయి.
వివరాలు
చిన్న రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశం
ఎన్నికల పోలింగ్‌ను ఎన్ని దశల్లో నిర్వహించాలనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం.
అయితే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
జనాభా, భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పలు దశల్లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, అధికారుల అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఈ సమీక్షలు, నివేదికల ఆధారంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది.