ECI: ఓటర్ల జాబితాలో పేరు లేదా? మళ్లీ నమోదు చేసుకునేందుకు ఈసీ ప్రత్యేక డ్రైవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన అర్హులకు మరోసారి నమోదు చేసుకునే అవకాశం కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) పూర్తయిన ప్రాంతాల్లో ఈ డ్రైవ్‌ను నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే జాబితాలో చోటు దక్కని అర్హులతో పాటు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతను గుర్తించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.
వివరాలు
ఇళ్లకు వెళ్లి వివరాల సేకరణ
SIR ప్రక్రియలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయి అధికారులు (BLOలు) గైర్హాజరైనవారు,ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు, మరణించినవారు,ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైనవారి వివరాలను సేకరించారు.
ఈ సమాచారాన్ని ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి.. గతంలో జాబితాలో పేరు ఉండి ఇప్పుడు కనిపించని వ్యక్తులను గుర్తించాలని ఈసీ సూచించింది.
ఈ జాబితా సిద్ధమైన తర్వాత BLOలు ఆయా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవాలి.
సంబంధిత వ్యక్తులు ఓటరుగా నమోదయ్యేందుకు అర్హత కలిగి ఉంటే.. ఫారం-6 ద్వారా మళ్లీ నమోదు చేసుకునేలా సహకరించాలని ఆదేశించింది.
ప్రతి వారం కనీసం 20 నుంచి 25మంది ఓటర్లను కలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొంది.
వివరాలు
తొలిసారి ఓటు వేసే యువతపైనా ఫోకస్
మొత్తం ప్రక్రియను సుమారు నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది.
ఇంటింటి పరిశీలన సమయంలో ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులను గుర్తించడంతో పాటు తొలిసారి ఓటు హక్కు పొందబోయే యువతను కూడా గుర్తించాలని ఈసీ తెలిపింది.
ముఖ్యంగా కార్మికులు నివసించే ప్రాంతాలు, నిరాశ్రయులు, అణగారిన వర్గాలకు చెందిన అర్హుల కోసం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను నిర్వహించాలని సూచించింది.
BLOలు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు, ఫారం-6 ద్వారా వచ్చిన దరఖాస్తులు, పరిశీలనకు సంబంధించిన నివేదికలను సంబంధిత ఎన్నికల నమోదు అధికారులకు (EROలు) సమర్పించాలి.
ఈ వివరాలను పరిశీలించిన అనంతరం చట్ట నిబంధనలకు అనుగుణంగా EROలు తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
వివరాలు
రాజకీయ పార్టీల బూత్ ప్రతినిధులకు కూడా సమాచారం
ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సిద్ధం చేసిన జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులతోనూ పంచుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
తద్వారా క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు, ఓటర్ల నమోదుకు సంబంధించిన ప్రక్రియపై సంబంధిత ప్రతినిధులకు సమాచారం అందేలా చూడాలని పేర్కొంది.
వివరాలు
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
ఓటరు నమోదుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు (CEOs), జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), EROలు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఈసీ సూచించింది.
విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, స్థానిక స్థాయిలో ప్రచార కార్యక్రమాలు, SVEEP కార్యక్రమాలు, మీడియా సమావేశాలను నిర్వహించాలని ఆదేశించింది.
ప్రత్యేక డ్రైవ్ పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా ఈసీ స్పష్టం చేసింది.
ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొంటూ.. అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది.