ఎన్నికల ముంగిట రాజస్థాన్ ప్రభుత్వానికి ఝలక్.. సీఎం కుమారుడికి ఈడీ సమన్లు
త్వరలోనే రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి కేంద్ర ఎజెన్సీ షాకిచ్చింది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. మరోవైపు రాజస్థాన్ లో సంచలం సృష్టించిన పరీక్ష పేపర్ లీక్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు(PCC) గోవింద్ సింగ్ దొత్సరా (Govind Singh Dotasra) ఇంట్లో సోదాలను చేపట్టింది. అశోక్ గహ్లోట్ కుమారుడు వైభవ్, ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించారన్న ఈడీ, సమన్లు ఇచ్చింది. అక్టోబర్ 27న జైపూర్‌లో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. వైభవ్ గెహ్లాట్, ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నవంబర్ 25న రాజస్థాన్‌లో పోలింగ్
నవంబర్ 25న రాజస్థాన్‌లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ రెండు కేసులు రాజకీయాలను వేడెక్కించాయి. ఈ మేరకు ఈడీ అలజడులపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మరోసారి అధికారంలోకి వస్తే ఏటా మహిళలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని రాజస్థాన్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ హామీ ఇచ్చిన రెండో రోజే వైభవ్ గెహ్లాట్‌కి ఈడీ సమన్లు జారీ చేసిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆ పార్టీకి ఓ అవగాహన వచ్చిందని, ఈ మేరకే ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహించింది. అంతకుముందు రోజు పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దొత్సరా ఇంట్లో సోదాలు చేశారు. ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారని ఈడీ ఆరోపించడం గమనార్హం.