Loading...
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. నిత్యావసరాల ధరల కట్టడికి ఏపీ సర్కార్‌ యాక్షన్‌ ప్లాన్‌!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. నిత్యావసరాల ధరల కట్టడికి ఏపీ సర్కార్‌ యాక్షన్‌ ప్లాన్‌!

CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. నిత్యావసరాల ధరల కట్టడికి ఏపీ సర్కార్‌ యాక్షన్‌ ప్లాన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్‌ఎస్‌కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్‌ నినో కారణంగా తలెత్తుతున్న పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలు పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. గోడౌన్లలో ఉన్న బియ్యం నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేయాలని సూచించారు. అలాగే ఉల్లి కొనుగోళ్లను చేపట్టడంతో పాటు భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని తెలిపారు.

వివరాలు

50.7 శాతం లోటు వర్షపాతం

స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్లను వ్యవస్థీకృతం చేయడం ద్వారా కూరగాయల ధరలను నియంత్రించవచ్చని చంద్రబాబు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైందని సీఎం వెల్లడించారు. ముఖ్యంగా ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు.

ఖరీఫ్‌ సీజన్‌లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా.. ఎల్‌ నినో ప్రభావంతో ఇప్పటివరకు 79 శాతం భూముల్లో మాత్రమే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.

కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పంటలపై ఎల్‌ నినో ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే రూ.60 కోట్లతో కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేశామని చంద్రబాబు తెలిపారు.

వివరాలు

వర్షాధార పంటలకు ప్రాధాన్యత

అలాగే 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందించినట్లు వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించామని, ఆ నిధులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

అదే సమయంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పశువులకు అవసరమైన నీటితో పాటు తగినంత పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు

చివరి భూములకు నీరు అందేలా చర్యలు

హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు.

తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరాను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం సూచించారు.

రైతులకు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన కల్పిస్తూ.. ఎల్‌ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను వారికి వివరించాలని కోరారు.

విపత్తు పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎల్‌ నినో సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రైతులు, ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT