ECI: లోక్‌సభ ఎన్నికల డేటాసెట్'ను విడుదల చేసిన ఎన్నికల సంఘం
భారత ఎన్నికల సంఘం (ECI) గురువారం లోక్‌సభ ఎన్నికల డేటా సెట్‌ను విడుదల చేసింది. ఈ డేటా సెట్‌లో 42 గణాంక నివేదికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై 14 నివేదికలు ఉన్నాయి. 100 గణాంకాలను విడుదల చేసి, అవి పారదర్శకత, పరిశోధన లక్ష్యంగా రూపొందించబడినట్లు తెలిపింది. ఈ డేటా సెట్‌ను విడుదల చేయడం ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెట్‌గా నిలుస్తుందని కూడా పేర్కొంది.
64.64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు
ఈ డేటా సెట్‌లో పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వివరణ,ఎన్నికల అధికారుల సంఖ్య, పోలింగ్ స్టేషన్ల సంఖ్య,రాష్ట్రాలు/పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా ఓటింగ్ శాతం,పార్టీల వారీగా ఓట్ల వాటా,లింగ ఆధారిత ఓటింగ్ వివరాలు,రాష్ట్రాల వారీగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం,ప్రాంతీయ వైవిధ్యాలు,నియోజకవర్గాల డేటా,జాతీయ, ప్రాంతీయ/గుర్తింపు పొందని స్వతంత్ర పార్టీల పనితీరు, గెలిచిన అభ్యర్థుల విశ్లేషణ,నియోజకవర్గం వారీగా ఫలితాలు, ఇతర అంశాలు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం, 64.64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించి ప్రపంచ రికార్డును సృష్టించారు. 2024లో నామినేషన్ల సంఖ్య 12,459 కాగా, 2019లో అది 11,692 ఉంది. 2024లో 8,360 మంది అభ్యర్థులు పోటీపడగా, 2019లో ఆ సంఖ్య 8,054గా ఉండింది.
2019 నుండి ట్రాన్స్‌జెండర్ల ఓటర్ల సంఖ్యలో 46.4 శాతం పెరుగుదల
పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని నివేదిక పేర్కొంది. పురుష ఓటర్ల శాతం 65.55 కాగా, మహిళా ఓటర్ల శాతం 65.78కి చేరుకుంది. 2019లో 726 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసారని, 2024లో ఆ సంఖ్య 800కి చేరుకుందని తెలిపింది. డేటా ప్రకారం, 2019 నుండి ట్రాన్స్‌జెండర్ల ఓటర్ల సంఖ్యలో 46.4 శాతం పెరుగుదల నమోదైనట్లు కనిపిస్తుంది. 2019లో 61,67,482 మంది విభిన్న ప్రతిభావంతులు ఓటింగ్ కోసం నమోదు చేసుకోగా, 2024లో ఈ సంఖ్య 90 లక్షలకు చేరింది. 2019లో 540 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరిగింది, అయితే 2024లో కేవలం 40 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే రీపోలింగ్ జరిగింది.