LOADING...
Election Commission: 22 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడోదశ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం సిద్ధం
22రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడోదశ ఓటర్ల జాబితా సవరణకు ఈసీ సిద్ధం

Election Commission: 22 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడోదశ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
09:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం మూడోదశ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 22 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 40కోట్ల మంది ఓటర్లను పరిధిలోకి తీసుకుంటూ రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితా వడపోత కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు సోమవారం వెల్లడించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడడంతో మళ్లీ మూడోదశ సవరణ కార్యక్రమంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్‌,తమిళనాడు,రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గోవా, బిహార్ రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించారు. అస్సాంలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

వివరాలు 

60కోట్ల మంది ఓటర్ల వివరాల పరిశీలన పూర్తి 

దేశంలో మొత్తం 99కోట్ల మంది ఓటర్లు ఉండగా,అందులో 60కోట్ల మంది ఓటర్ల వివరాల పరిశీలన ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన 40 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన సవరణ ప్రక్రియను మరో 17 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఫిబ్రవరి 19న ఆయా రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు లేఖలు పంపింది.

వివరాలు 

సమగ్ర సవరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిహార్‌లోని రాజకీయ పార్టీలు

ఏప్రిల్‌లో సవరణ కార్యక్రమం చేపట్టేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అయితే పలు కారణాలతో ఈ కార్యక్రమం నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ముందుకు సాగలేదు. ముఖ్యంగా బిహార్‌లో ఓటర్ల సమగ్ర సవరణపై రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన అంశంపై తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పరిణామాలతో సవరణ ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement