AP Engineering Admissions 2026: ఇంజినీరింగ్ కనీస ఫీజు రూ.47 వేలు.. ఆగస్టు 10 నుంచి తరగతుల ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లోని ఇంజినీరింగ్ కళాశాలలకు 2026-27 విద్యాసంవత్సరానికి కనీస ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ప్రాథమికంగా రూ.47 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.40 వేల కనీస ఫీజును రూ.7 వేల మేర పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 212 ఇంజినీరింగ్ కళాశాలల్లో 120కి పైగా కళాశాలల్లో ప్రస్తుతం కనీస ఫీజే అమల్లో ఉంది. ఇక రూ.47 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలలకు గత విద్యాసంవత్సరంలో అమలులో ఉన్న ఫీజులనే తాత్కాలికంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఫీజులను ఖరారు చేయడానికి అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ప్రస్తుతానికి గత ఏడాది ఫీజుల ఆధారంగానే కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం.
వివరాలు
ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత కొత్త ఫీజులు
ఇటీవల ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీకి పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది.
ఈ కమిటీ కళాశాలల ఆదాయం, వ్యయాల వివరాలను పరిశీలించి కొత్త ఫీజులను నిర్ణయించనుంది.
అనంతరం ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత కొత్త ఫీజులు అధికారికంగా అమల్లోకి వస్తాయి.
సాధారణంగా ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పునర్నిర్ణయించాల్సి ఉంటుంది.
గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు 2025-26 విద్యాసంవత్సరంతో ముగియడంతో, 2026-27 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది.
అయితే ఫీజుల నిర్ణయానికి అవసరమైన కమిటీ ఏర్పాటు ఆలస్యమైన కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది.
వివరాలు
అదనంగా 6 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి ఇచ్చిన ఏఐసీటీఈ
మరోవైపు,ఈసారి ఏఐసీటీఈ రాష్ట్రానికి అదనంగా 6 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి ఇచ్చింది.
అయినప్పటికీ,గత ఏడాది ఉన్న సీట్ల సంఖ్యనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో ఈ విద్యాసంవత్సరంలో కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోయింది.
రాష్ట్రంలోని మొత్తం 212 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటివరకు 138 కళాశాలలకు సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపును జారీ చేశాయి.
మిగిలిన కళాశాలలకు కూడా ఒకటి, రెండు రోజుల్లో గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా,ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్ ప్రవేశాల తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది.
వివరాలు
ఈ నెల 16న కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ
దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఉన్నత విద్య కమిషనరేట్ బుధవారం విడుదల చేసింది. కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఈ నెల 16నజారీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్,ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుకు జూలై 20 నుంచి 29వరకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జూలై 22 నుంచి 31వరకు నిర్వహించనున్నారు.
కళాశాలలు,బ్రాంచీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు జూలై 25 నుంచి 31 వరకు గడువు కల్పించారు.
ఇప్పటికే నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు ఆగస్టు 1న అవకాశం ఉంటుంది.
సీట్ల కేటాయింపును ఆగస్టు 6న ప్రకటించనుండగా,సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి 13 మధ్య సంబంధిత కళాశాలల్లో చేరాలి.
కొత్త విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ తరగతులు ఆగస్టు 10నుంచి ప్రారంభం కానున్నాయి.