LOADING...
Ethiopia volcanic eruption:10,000 సంవత్సరాల తర్వాత ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం... విమాన సర్వీసులపై ఎఫెక్ట్... డిల్లీని చేరనున్న పొగ? 
విమాన సర్వీసులపై ఎఫెక్ట్... డిల్లీని చేరనున్న పొగ?

Ethiopia volcanic eruption:10,000 సంవత్సరాల తర్వాత ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం... విమాన సర్వీసులపై ఎఫెక్ట్... డిల్లీని చేరనున్న పొగ? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇథియోపియాలో భారీ అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించింది. వేల ఏళ్లుగా నిశ్చలంగా ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం సుమారు 10,000 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా పెల్లుబికి, విపరీతమైన బూడిదను వెలువరించింది. ఈ విస్ఫోటనంతో తయారైన బూడిద మేఘం ఉత్తర భారతదేశ దిశగా కదులుతోందని టౌలౌస్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ (VAAC) సోమవారం ప్రకటించింది. ఈ అనూహ్య విస్ఫోటనం ప్రభావిత ప్రాంతాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో, భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా హెచ్చరిక జారీ చేసింది.

వివరాలు 

ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ దిశగా బూడిద మేఘాలు

ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ విస్ఫోటనం మొదలైందని వీఏఏసీ తెలిపింది. ప్రస్తుతం పేలుడు ఆగిపోయినా,ఏర్పడిన భారీ బూడిద మేఘం ఉత్తర భారతదేశం వైపు సాగే అవకాశం ఉండటంతో వాతావరణ సంస్థలు దాని మార్గాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత రాష్ట్రాలకు కూడా ఈ బూడిద చేరే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎర్టా ఆలే పర్వత శ్రేణిలో ఉన్న ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 10,000-12,000 సంవత్సరాల క్రితం మాత్రమే కార్యాచరణలోకి వచ్చింది. తాజా విస్ఫోటనం కారణంగా ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ దిశగా బూడిద మేఘాలు వ్యాపించి తూర్పు దిశగా కదులుతున్నాయని అల్ అరేబియా నివేదిక తెలిపింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో విమాన రాకపోకలు ప్రభావితం అయ్యాయి.

వివరాలు 

డీజీసీఏ తాజా మార్గదర్శకాలు 

ఈ పరిస్థితుల్లో కేరళలోని కన్నూర్ నుండి అబుదాబీకి బయలుదేరిన ఇండిగో విమానం(6E 1433) ముందు జాగ్రత్త చర్యగా అహ్మదాబాద్ వైపు మళ్లించారు. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌లు సూచనలు, హెచ్చరికలు జారీ చేశాయి. అయితే భారత భూభాగంపై బూడిద ప్రభావం విషయానికివస్తే, ఇప్పటివరకు ప్రత్యేక సలహాలు రిలీజ్ కాలేదు. ఇథియోపియాలో జరిగిన హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం నేపథ్యంలో,డీజీసీఏ దేశంలోని విమానయాన సంస్థలు,విమానాశ్రయాలకు విపులమైన సూచనలు పంపింది. రీజినల్ ఎయిర్ రూట్స్ వైపు ప్రమాదకరమైన అగ్నిపర్వత బూడిద చేరే అవకాశాలు ఉన్నందున,దాని ప్రభావం ఉన్న ప్రాంతాలను వెంటనే దాటవేయాలని ఆదేశించింది. రన్‌వేలు,టాక్సీవేలు,ఏప్రాన్‌లపై బూడిద పడిన అనుమానం ఉన్నప్పుడల్లా సవివరంగా తనిఖీ చేయాలని,శుభ్రపరిచే వరకు కార్యకలాపాలను తగ్గించాలా లేదా పూర్తిగా నిలిపివేయాలా అన్న నిర్ణయం తీసుకోవాలని సూచించింది.