ఆర్టీఏ ఏజెంట్ల గుట్టు రట్టు.. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరుగురు అరెస్ట్
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్టీఏ ఏజెంట్లను రాచకొండ పోలీస్ అదుపులోకి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మన్నెంగూడ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సదరు ఏజెంట్లను ఎల్బీనగర్ (ఎస్ఓటీ),ఆదిబట్ల పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి ఆశపడి నకిలీ ఇన్సూరెన్సు, ఆధార్ కార్డులు, పోలీస్ మిస్సింగ్ సర్టిఫికేట్‌లను తయారు చేసే ముఠాను సంయుక్తంగా అరెస్టు చేశారు. రాఘవేందర్ రెడ్డి, వేణు, శ్రీధర్, శ్రీశైలం, యాదగిరి, ఆనంద్‌లను నిందితులుగా గుర్తించారు. వీరంతా మన్నెగూడ వద్ద లక్ష్మి జిరాక్స్ దుకాణం వద్ద ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెహికిల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను ఇప్పించేందుకు ఏర్పాటు చేసుకున్న 74 నకిలీ బీమా పత్రాలు, ఆధార్, పోలీస్ మిస్సింగ్ లెటర్స్, తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కాలం చెల్లిన పత్రాలను సవరించి ఆర్టీఏకు సమర్పిస్తున్నారు :రాచకొండ పోలీసులు
ఇప్పటికే ఈ నకిలీ సర్టిఫికేట్‌లను ఎంత మందికి ఇచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కో నకిలీ పత్రానికి రూ. 2 నుంచి 10 వేల వరకు విక్రయస్తున్నట్లు గుర్తించారు. ఫిటినెస్ లేని వాహనాలను రోడ్లపై ప్రమాదకరంగా తిరిగేలా ప్రోత్సహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని గుర్తించారు. ఇతనితో పాటు కొంగల ఆనంద్, అడుశెట్టి వేణు, పుట్టబత్తిని శ్రీధర్, అనుపాటి శ్రీశైలం, చాపల యాదగిరిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులు, 2 లాప్ ట్యాప్ లు, రూ. 18 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. కాలం చెల్లిన సర్టిఫికేట్‌లను స్కాన్ చేసి తేదీలను సవరిస్తూ ఆర్టీఏకు సమర్పిస్తున్నట్లు గుర్తించామన్నారు.