Kerala: చిన్నారుల వైద్య సాయం పేరుతో నకిలీ క్యూఆర్ కోడ్.. ట్రస్ట్‌పై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
దాతృత్వం ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామంటూ ప్రజలను నమ్మించి,నకిలీ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు వసూలు చేసిన ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేరళలోని మంపట్ట ప్రాంతానికి చెందిన శ్రీ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్‌పై ముక్కం పోలీసులు కేసు నమోదు చేశారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల పేర్లను ఉపయోగించి నకిలీ క్యూఆర్ కోడ్ రూపొందించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కోడ్ ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.
వివరాలు
క్యూఆర్ కోడ్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా ఫ్రీజ్
దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 318 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విరాళాల సేకరణకు ఉపయోగించినట్లు భావిస్తున్న క్యూఆర్ కోడ్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాను అధికారులు ఇప్పటికే నిలిపివేశారు.
ఈ విషయాన్ని ముక్కం సబ్ ఇన్‌స్పెక్టర్ నిర్మల్ తెలిపారు. వసూలు చేసిన డబ్బును ఇతర బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారా? ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మోసానికి పాల్పడేందుకు ఉపయోగించిన ఇతర మార్గాలపైనా ఆరా తీస్తున్నారు.
వివరాలు
విరాళాలు ఇచ్చే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని కమిటీ విజ్ఞప్తి
మరోవైపు, ఎస్‌ఎంఏ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేసేందుకు ఏర్పాటైన కమిటీ ప్రతినిధులు పోలీసుల చర్యను స్వాగతించారు.
సకాలంలో కేసు నమోదు చేయడం వల్ల ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
సంబంధిత కమిటీలకు సమాచారం ఇవ్వకుండా, వాటి అనుమతి లేకుండా చేపట్టే విరాళాల సేకరణకు ప్రజలు స్పందించవద్దని సూచించారు.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల పేరుతో వచ్చే విరాళాల అభ్యర్థనల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కమిటీ ప్రతినిధులు కోరారు.
డబ్బులు పంపించే ముందు విరాళాల సేకరణ నిజమైనదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.
అనుమానాస్పదంగా విరాళాలు సేకరించడం లేదా ఆర్థిక లావాదేవీలు జరపడం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.