Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. నిరసన మంగళవారం దిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. దీంతో దిల్లీ-హర్యానా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేదని లేదని, దిల్లీలో నిరసన తెలిపి తీరుతామని రైతులు రాత్రంతా సరిహద్దులోనే ఉండిపోయారు. దిల్లీ సరిహద్దులో బుధవారం కూడా ఆందోళలను కొనసాగించేందుకు సిద్ధమవయ్యారు. దీంతో సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
రాకపోకలకు అంతరాయం
రైతుల ఉద్యమం కారణంగా యూపీ సరిహద్దులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. యూపీ గేట్ వద్ద కఠినమైన వద్ద పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత దిల్లీలోని పంపిస్తున్నారు. దిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9పై దాదాపు 8 కిలోమీటర్ల మేర కాంక్రీట్ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మంగళవారం తొమ్మిది మెట్రో స్టేషన్ల గేట్లను దాదాపు 12 గంటల పాటు మూసివేసింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. గేట్లు మూసి ఉండడంతో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. బుధవారం కూడా మెట్రో స్టేషన్ల గేట్లను మూసి వేసే అవకాశం ఉంది.