Page Loader
#NewsBytesExplainer: భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను విక్రయించనున్న అమెరికా, వాటి ప్రత్యేకతలు ఇవే..!
భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను విక్రయించనున్న అమెరికా, వాటి ప్రత్యేకతలు ఇవే..!

#NewsBytesExplainer: భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను విక్రయించనున్న అమెరికా, వాటి ప్రత్యేకతలు ఇవే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ ఒప్పందాలు, వాణిజ్య సంబంధాల గురించి సమగ్ర చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ట్రంప్ భారత్‌కు "F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్"ను అందించే ప్రతిపాదనను ఉంచారు. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలలో F-35 ప్రథమ స్థానంలో ఉంది. అత్యంత ఆధునిక టెక్నాలజీ, అప్రతిహత దాడి సామర్థ్యాలతో అత్యంత ప్రమాదకరమైన యుద్ధవిమానంగా పేరుంది. ఈ విమానాలు ఉంటె శత్రు దేశాల హడలి చావాల్సిందే.

వివరాలు 

F-35 యుద్ధ విమాన లక్షణాలు 

''మేము భారత్‌కు బిలియన్ల డాలర్ల విలువైన రక్షణ పరికరాలను విక్రయిస్తాం. అంతేకాకుండా, భారత్‌కు F-35 స్టెల్త్ ఫైటర్లను అందించేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నాము'' అని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. F-35 యుద్ధ విమానం 5వ తరం ఆధునిక ఫైటర్ జెట్. దీని ప్రధాన విశేషం స్టెల్త్ టెక్నాలజీ, అంటే శత్రుదేశాల రాడార్లకు కనిపించకుండా దాడులు చేయగలగడం. దీంట్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, ఓపెన్ ఆర్కిటెక్చర్, అధునాతన సెన్సార్లు ఉన్నాయి. దీని వల్ల శత్రువుల సిగ్నల్స్‌ను సమర్థవంతంగా నిరోధించగలదు. దీని వేగం, పరిధి, లక్ష్యంపై కచ్చితమైన దాడి సామర్థ్యం దీన్ని మరింత ప్రమాదకరమైనదిగా మారుస్తాయి.

వివరాలు 

F-35 వేరియంట్లు & ధరలు 

F-35A - సాధారణ టేకాఫ్, ల్యాండింగ్ మోడల్. ప్రధానంగా అమెరికా వైమానిక దళం దీనిని వినియోగిస్తుంది. దీని ధర $80 మిలియన్. F-35B - షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ (STOVL) సామర్థ్యం కలిగిన వెర్షన్. అమెరికా మెరైన్ కార్ప్స్ ప్రధానంగా దీన్ని వాడుతుంది. దీని ధర $115 మిలియన్. F-35C - ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ల కోసం రూపొందించిన మోడల్. ఇది ప్రధానంగా అమెరికా నేవీ ఉపయోగిస్తుంది. దీని ధర $110 మిలియన్.

వివరాలు 

F-35ను వినియోగిస్తున్న దేశాలు 

అమెరికా ఈ అత్యాధునిక యుద్ధవిమానాలను తన మిత్ర దేశాలకు కూడా అందించింది. ఆస్ట్రేలియా - 72 F-35 జెట్స్ బ్రిటన్, ఇటలీ, నార్వే-ఇప్పటికే ఈ జెట్స్‌ను వినియోగిస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధవిమానాలను ఆర్డర్ చేసాయి. భారత్ కోసం F-35 - అవకాశాలు & సవాళ్లు భారత్ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే, NATOలో లేని,పసిఫిక్ ప్రాంతానికి వెలుపల ఉన్న తొలి దేశంగా F-35ను స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత వైమానిక దళం అత్యాధునిక రాఫెల్ యుద్ధవిమానాలను కలిగి ఉంది. రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్ కాగా, F-35 పూర్తి 5వ తరం స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అయితే,F-35ను స్వీకరించడం అంత సులభం కాదు.

వివరాలు 

ఎక్కువ ఖర్చు & నిర్వహణ: 

ఈ విమానాలను కొనుగోలు చేయడమే కాకుండా, వాటి నిర్వహణ, స్పేర్ పార్ట్స్, మౌలిక సదుపాయాలకు భారీ వ్యయం అవసరం. ప్రత్యేక పైలట్ శిక్షణ: F-35ను నడిపేందుకు పైలట్లకు ప్రత్యేక శిక్షణ అవసరం. రక్షణ వ్యూహం మార్పులు: భారత వైమానిక దళానికి కొత్త టెక్నాలజీపై ఆధారపడే విధంగా వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ భారత్‌కు అత్యున్నత రక్షణ సామర్థ్యాన్ని అందించగలదు. అయితే దీని కొనుగోలు, నిర్వహణలో భారీ సవాళ్లు ఉన్నాయి. భారత్ దీనిని స్వీకరించాలా? రాఫెల్ యుద్ధ విమానాలతో కొనసాగాలా? అనేది భవిష్యత్తులో తేలాల్సిన విషయం.