
FINE RICE DISTRIBUTION: నేటి నుండి రేషన్ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన అడుగు వేసింది.
తెల్ల రేషన్ కార్డు కలిగిన, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది.
ఇటీవల హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం లాంఛనంగా ప్రారంభమైంది.
మంగళవారం నుంచి హైదరాబాద్‌ను మినహాయించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పంపిణీ కొనసాగనుంది.
రాష్ట్ర జనాభాలో 85% మంది ప్రజలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనున్నదని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఛౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ
ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
హైదరాబాద్‌ను మినహాయించి, మిగిలిన అన్ని జిల్లాల్లో నేటి నుండి ఛౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం అందించనున్నారు.
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు.
ఈ పథకాన్ని ఉగాది పండుగ సందర్భంగా మార్చి 30న హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించారు.
రంజాన్ పండుగ అనంతరం మంగళవారం ఈ పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారికంగా ప్రారంభించనున్నారు.
వివరాలు
అక్రమాలకు తావు లేకుండా చర్యలు
ప్రభుత్వం ఇప్పటికే 17,500 పైగా ఛౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం సరఫరా పూర్తి చేసింది.
మిగిలిన దుకాణాల్లో కూడా దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది.
గత ప్రభుత్వ హయాంలో రూ.10,665 కోట్ల వ్యయంతో కూడా సరైన ఫలితాలు సాధ్యం కాలేదు.
అయితే, కొత్త ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు సిద్ధమైంది.
గతంలో కొందరు అధికారులు, డీలర్లు కుమ్మక్కై బియ్యాన్ని కోళ్ల ఫారాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి.
కాబట్టి, నూతన పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతంగా పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు.
వివరాలు
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు
ప్రస్తుతం 2.85 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నా, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు 30 లక్షలకు పైగా చేరాయి.
త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేసి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు పెంచే అవకాశముందని అధికారులు తెలిపారు.
దీంతో రాష్ట్రంలోని 85% పేదలకి నాణ్యమైన సన్న బియ్యం అందుబాటులోకి రానుంది.
వివరాలు
డీలర్లపై ప్రత్యేక నిఘా
ఆహార భద్రతను సమర్థంగా అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సన్న బియ్యం నిల్వలు క్రమంగా రిజిస్ట్రర్‌లో నమోదు చేసి, దుకాణాలలో సమర్థవంతంగా అందుబాటులో ఉంచే బాధ్యత డీలర్లదేనని స్పష్టం చేశారు.
అక్రమ రవాణా, నిల్వల లోపం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో సన్న బియ్యం అందుబాటులో ఉండదు
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, అక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం కాకుండా ముతక బియ్యం, దొడ్డు బియ్యం అందించనున్నట్లు తెలిపారు.
నగరంలోని లబ్ధిదారులకి ఇది నిరాశ కలిగించే విషయం కావొచ్చు.
వివరాలు
ఆశావహులలో కొత్త నమ్మకం
త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డులు అందిస్తామని ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.
దేశవ్యాప్తంగా తొలిసారి తెలంగాణలోనే ఇలాంటి వినూత్న ప్రయోగం ప్రారంభించడం గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు.