Bapatla: బాపట్లలో చెలరేగిన మంటలు.. రూ. 400 కోట్లమేర ఆస్తినష్టం
బాపట్ల జిల్లాలోని ఓ వస్త్ర పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంకొల్లులోని ఎన్ఎన్ఎల్ వస్త్ర పరిశ్రమలో ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కార్మికుల కళ్లముందే మంటలు దావానలంలా వ్యాప్తించి పరిశ్రమ మొత్తన్ని చుట్టముట్టాయి. వస్త్ర తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో పాటు మిషనరీ కూడా మంటల్లో ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో రూ. 400 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు మండల కేంద్రానికి సమీపంలో ఎన్ఎన్ఎల్ వస్త్ర పరిశ్రమలో దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. దసరా సీజన్ కావడంతో భారీగా వస్త్రాల తయారీ చేపట్టేందుకు ముడిసరుకును సిద్ధం చేశారు. అయితే ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో యాజమాన్యం కన్నీరుమున్నీరుగా విలపించారు.
మంటలను అదుపు చేయడానికి 12 గంటల పాటు శ్రమించిన సిబ్బంది
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వస్త్రాలు, దారాలకు మంటలకు వ్యాపించాయి. మంటలను అదుపు చేయడానికి ఫైరింజన్లలో మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాద సమయంలో పరిశ్రమలో వందలాది మంది కార్మికులు చేస్తున్నా ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. మంటలను పసిగట్టిన కార్మికులు వెంటనే బయటికి పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది.