మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు
మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సరిహద్దు ఔట్‌పోస్ట్‌పై ఆదివారం రాత్రి గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. దవ్కీ పట్టణానికి సమీపంలోని ఉమ్సీయమ్ గ్రామంలో రాత్రి 10గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు సోమవారం తెలిపారు. బీఎస్ఎఫ్ మేఘాలయ ఫ్రాంటియర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా, మేము బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలించడానికి ఉద్దేశించిన భారీ సంఖ్యలో వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. స్మగ్లర్లను కూడా గుర్తించినట్లు చెప్పారు. దీని కారణంగానే బీఎస్ఎఫ్ అవుట్‌పోస్ట్‌పై దాడి చేయడానికి స్మగ్లర్లు ఒక గుంపును పంపినట్లు పేర్కొన్నారు.
బీఎస్ఎఫ్ సిబ్బంది డ్యూటీలో మద్యం తాగి ఉన్నారని గ్రామస్తులు ఆరోపణ
గ్రామస్థుల మూకదాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. కొంతమంది గ్రామస్థులు బలవంతంగా అవుట్‌పోస్ట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, వారిని వెనక్కి నెట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ముగ్గురు గ్రామస్తులు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులతో కూడిన వాహనం ఔట్‌పోస్టు సమీపంలో చెడిపోవడంతో బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని స్మగ్లర్లుగా అనుమానించారు. వారిపై పలు అభియోగాలు మోపారు. దీనిపై ఆగ్రహానికి గురైన సమీపంలోని గ్రామస్థులు వారిని రక్షించడానికి వచ్చారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే బీఎస్ఎఫ్ సిబ్బంది డ్యూటీలో మద్యం తాగి ఉన్నారని గ్రామస్తులు ఆరోపించగా, దానిని ఐజీ ప్రదీప్ కుమార్ ఖండించారు. సరిహద్దులోని సిబ్బంది మద్యం తాగడానికి అనుమతి లేదని చెప్పారు.