Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి
తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే తిరుమల-అలిపిరి కాలినడకన వెళ్లే మార్గంలో మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. ఈ ఐదు చిరుతలు కూడా తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపాలలో సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిరుతల కదలికలకు సంబంధించిన దృశ్యాలు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డు అయినట్లు చెబుతున్నారు.
భక్తుల భద్రతపై టీటీడీ- అటవీశాఖ అధికారుల సమీక్ష
మరో ఐదు చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై మధ్యాహ్నం 3గంటలకు టీటీడీతో పాటు అటవీశాఖ అధికారులు సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటే, చిన్నారి లక్షితను చంపేసిన చిరుత అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. అయితే ఆ చిరుత బోనులోకి వచ్చే సమయంలో స్వల్పంగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది మ్యాన్ ఈటర్ అవునా? కాదా? అనేది తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు కొన్ని పరీక్షలు చేస్తున్నారు.