Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం.. ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్,రాజౌరీల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కుండపోతతో ఆకస్మిక వరదలు పోటెత్తగా,పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతైనట్లు సమాచారం ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వందలాది ఇళ్లు,పాఠశాలలు దెబ్బతినడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అధికారుల సమాచారం ప్రకారం, పూంచ్ జిల్లాలో వరదలు, కొండచరియల కారణంగా తొమ్మిది మంది మృతి చెందగా,ముగ్గురు గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా,ఇద్దరు గల్లంతయ్యారు. అక్కడ ఒకరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం ఆర్మీ, పోలీసులు, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.
వివరాలు
127 కనాల్స్ విస్తీర్ణంలో దెబ్బతిన్న పంటలు
ముఖ్యంగా పూంచ్ జిల్లాలోని సురన్‌కోట్ తహసీల్‌లో నష్టం అత్యధికంగా నమోదైంది.
ప్రకృతి విపత్తు ప్రభావంతో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో కలిపి 130కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే 18 పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి.
అనేక వాహనాలు వరద నీటిలో చిక్కుకుని నష్టపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలు పూర్తిగా నిలిచిపోగా, వందలాది కుటుంబాలకు తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడింది.
ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 127 కనాల్స్ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
అత్యవసరంగా జమ్మూకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా
ఘటన సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని అత్యవసరంగా జమ్మూకు చేరుకున్నారు.
అనంతరం ఉన్నతాధికారులతో సమావేశమై సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు. బాధితుల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలువురు రాజకీయ నాయకులు ఈ విషాద ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.