Technical Glitch: నెవిటేర్ సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో, ముఖ్యంగా దిల్లీ,ముంబయిలో, విమాన సర్వీసులు అంతరాయానికి గురయ్యాయి. ఈ పరిణామంతో వందలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ ఉపయోగించే నెవిటేర్ సిస్టమ్‌లో సుమారు 45 నిమిషాలపాటు సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ సమస్య ఉద్భవించింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం 6.45 గంటల సమయంలో ఈ సాంకేతిక అంతరాయం గుర్తించబడింది. టికెట్ బుకింగ్,చెక్‌ఇన్ ప్రక్రియల కోసం ఎయిర్‌లైన్స్ ఆధారపడే నెవిటేర్ వ్యవస్థలో లోపం ఏర్పడింది. గంటలోపు సమస్యను సరిచేసినా, ఆ సమయంలో సిబ్బంది బుకింగ్ మరియు చెక్‌ఇన్ ప్రక్రియలను చేతితో నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఇదే పరిస్థితి ముంబయి విమానాశ్రయంలో కూడా నెలకొంది.
వివరాలు
ప్రభావితమైన ఇండిగో, ఆకాశా ఎయిర్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు
ఫలితంగా ఇండిగో, ఆకాశా ఎయిర్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వంటి ఎయిర్‌లైన్స్ సర్వీసులు ప్రభావితమయ్యాయి. రిజర్వేషన్, చెక్‌ఇన్, బోర్డింగ్ వంటి కీలక సేవలకు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను నెవిటేర్ అందిస్తుంది. ఈ వ్యవస్థలో లోపం తలెత్తినప్పుడు ప్రయాణికుల వివరాల ప్రాసెసింగ్‌లో అంతరాయం కలిగి, జాప్యాలు, రద్దీ పరిస్థితులు ఏర్పడుతాయి. గత నవంబర్‌లో కూడా దిల్లీలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా 800కు పైగా విమానాలు ఆలస్యమైన విషయం గుర్తుంచుకోవచ్చు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే దిల్లీ విమానాశ్రయం రోజుకు సుమారు 1500 విమాన సర్వీసులను నిర్వహిస్తుండగా, ముంబయి విమానాశ్రయం రోజుకు దాదాపు 1000 సర్వీసులను నిర్వహిస్తోంది.