FLN Selfie Stand : ఇక పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ఫీ స్టాండ్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవసరమైన అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించేందుకు తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకపై పాఠశాలలతోపాటు మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ కార్యాలయాల్లోనూ ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ఫీ స్టాండ్లు ఏర్పాటు చేయనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ తరగతికి అనుగుణంగా నిర్దేశించిన అభ్యసన సామర్థ్యాలను సాధించడమే ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంపై విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేలా సెల్ఫీ స్టాండ్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాలలతోపాటు ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
సెల్ఫీ స్టాండ్ కోసం 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఫ్లెక్సీ
సెల్ఫీ స్టాండ్ కోసం 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఫ్లెక్సీని రూపొందించాలని సూచించారు.
ఆ ఫ్లెక్సీని ప్రత్యేక స్టాండ్‌గా ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో కనిపించేలా వీటిని ఏర్పాటు చేసి ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమానికి ప్రాధాన్యం కల్పించనున్నారు.