Jurala: జూరాల జలాశయానికి భారీగా వరద.. 81 వేల క్యూసెక్కులు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 91 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇందులో 81 వేల క్యూసెక్కులను జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 5,600క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల పథకాలు,జూరాల కుడి, ఎడమ కాల్వలకు తరలిస్తున్నారు. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 9.296 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలోకి 48 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. దిగువకు 58 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 59 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి దిగువకు 61 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
వివరాలు
శ్రీశైలంలో నిలకడగా నీటిమట్టం
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 81,905 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది.
గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 875.50 అడుగులుగా నమోదైంది.
నీటి నిల్వ 165.9244 టీఎంసీలకు చేరింది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి వరకు ఎస్‌ఎల్‌బీహెచ్‌ఈఎస్‌లో మొత్తం 17.622 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.