అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది
ఈ వార్తాకథనం ఏంటి
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
రాష్ట్రంలోని గురువారం కూడా అనేక ప్రాంతాలలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కొత్త ప్రదేశాలకు వరదలు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ క్రమంలో ఐఎండీ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.
రాబోయే కొద్ది రోజుల్లో అసోంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో గువాహటిలోని ఐఎండీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) గురువారం, శుక్రవారం 'ఎల్లో' అలర్ట్ ప్రకటించింది.
అసోం
నీటిలో మునిగిపోయిన 780 గ్రామాలు
అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ) నివేదిక ప్రకారం, బక్సా, బార్‌పేట, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, కోక్రాఝర్, లఖింపూర్, నల్‌బారి, సోనిత్‌పూర్, ఉదల్‌గురి జిల్లాల్లో 1,19,800 మందికి పైగా ప్రజలు వరద బారిన పడ్డారు.
నల్‌బారిలో అత్యధికంగా 45,000 మంది ప్రజలు వరదల వల్ల బాధపడుతున్నారని, బక్సా 26,500 మందికి పైగా, లఖింపూర్‌లో 25,000 మందికి పైగా ఉన్నారని పేర్కొంది.
ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, సివిల్ అడ్మినిస్ట్రేషన్స్, ఎన్జీఓలు ప్రజలను వరదల నుంచి రక్షిస్తున్నాయి.
ప్రస్తుతం 780 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. అసోం అంతటా 10,591.85 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఏఎస్డీఎంఏ తెలిపింది.